
న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ తన దృష్టిని రాయలసీమపై మరింత కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. తాజాగా సెప్టెంబర్ 10న అనంతపురంలో జరిగే “సూపర్ సిక్స్ సూపర్ హిట్” కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మొదట ఈ ఈవెంట్‌ను గోదావరి జిల్లాల్లో పెట్టాలని భావించినా, చివరికి సీమలో నిర్వహించడం వెనుక స్పష్టమైన రాజకీయ లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో మహానాడును కూడా కడప జిల్లాలో నిర్వహించిన టీడీపీ, ఆ తర్వాత ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీ ఉపఎన్నికల్లో తన హవాను చూపించింది.
దీంతో రాయలసీమలో పార్టీకి మద్దతు పెరుగుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కొత్త కార్యక్రమాలు కూడా సీమలోనే నిర్వహించడం గమనార్హం.
ప్రస్తుతం ప్రభుత్వం ఈ ప్రాంతంలో పరిశ్రమలు, విండ్ పవర్ ప్లాంట్లు, నీటి ప్రాజెక్టులు తీసుకురావడం ప్రారంభించింది. అదే సమయంలో టీడీపీ తన పాత ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.
జగన్ స్వస్థలం కడపలోనే కార్యకలాపాలు పెంచడం ద్వారా సైకిల్ పార్టీ తాము బలంగా ఉన్నామని చూపిస్తోంది. దీంతో భవిష్యత్తులో వైసీపీకి ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.