
న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఐటీ రాజధానిగా ఆవిర్భవించిన విశాఖపట్నం ఆసియాలోనే అతిపెద్ద డేటా హబ్‌గా నిలవబోతోంది. తాజాగా, దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్ కూడా విశాఖలో మెగా డేటా సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రాజెక్ట్ కోసం టీసీఎస్ సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ నగరం ఐటీ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని చెబుతున్నారు.
ఈ భారీ పెట్టుబడితో టీసీఎస్ 1,000 మెగావాట్ల డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. అంతేకాకుండా, వచ్చే నెలలో విశాఖలోనే ప్రారంభించనున్న డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా నగరం అభివృద్ధిలో టీసీఎస్ కీలక భూమిక పోషించనుంది.
రాబోయే రెండేళ్లలో విశాఖలో సుమారు రూ. 2.60 లక్షల కోట్ల విలువైన డేటా సెంటర్లు ఏర్పాటయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఇదిలా ఉండగా, ఇప్పటికే గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫో రూ. 87,520 కోట్లతో ఒక గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అమెరికాతో విశాఖ అనుసంధానం కాబోతోందని, అమిత వేగంతో డేటా బదిలీ చేయడానికి అవసరమైన సముద్రగర్భ కేబుల్ పనులు ఊపందుకుంటున్నాయి.
ఇక్కడ ఏర్పాటు అవుతున్న డేటా సెంటర్లతో సబ్ మెరైన్ కేబుళ్లను అనుసంధానించడానికి సిఫీ టెక్నాలజీస్ సిద్ధమైంది. గూగుల్ సంస్థ బ్లూరామన్ పేరుతో సబ్ మెరైన్ కేబుళ్లను విశాఖపట్నం తీసుకువస్తుంది. అదేవిధంగా, మెటా సంస్థ కూడా అమెరికా నుంచి బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా తదితర దేశాలకు 50 వేల కి.మీ. పొడవైన సబ్ మెరైన్ కేబుల్ వేయడానికి ఒప్పందాలు చేసుకుంది.
భారత్‌లో ముంబై, విశాఖ నగరాలను ల్యాండింగ్ సెంటర్‌లుగా మెటా ఎంపిక చేసింది. ఈ సంస్థ తీసుకువస్తున్న సబ్ మెరైన్ కేబుల్‌ను డేటా సెంటర్లకు అనుసంధానించే బాధ్యతను కూడా సిఫీనే తీసుకుంది. విశాఖ సమీపంలోని ఓజోన్ వ్యాలీలో సిఫీ టెక్నాలజీస్‌కు ఏపీ ప్రభుత్వం 25 ఎకరాలను కేటాయించింది.
