
తమిళనాడులో ప్రభుత్వ మద్యం సంస్థలపై ఈడీ దాడుల నేపథ్యంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ చర్యలు సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమని వ్యాఖ్యానించిన ధర్మాసనం, అవినీతికి సంబంధించి తదుపరి చర్యలను తక్షణం నిలిపివేయాలంటూ ఆదేశించింది.
మద్యం లైసెన్సుల మంజూరు, రవాణా, డిస్టిలరీలతో కుమ్మక్కై లెక్కల్లో చూపని డబ్బు లాభించారన్న ఆరోపణలతో ఈడీ తమిళనాడులో దాడులు చేసింది. ఈ క్రమంలో ఫోన్లను స్వాధీనం చేసుకుని డేటా క్లోన్ చేశారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు.
“వ్యక్తులపై కేసులు నమోదు చేయవచ్చు. కానీ సంస్థలపై ఎలా?” అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఈడీ చర్యలను సమర్థించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై డీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సుప్రీంకోర్టు తీర్పు పట్ల డీఎంకే హర్షం వ్యక్తం చేసింది. ఇది కేంద్ర బీజేపీ ప్రభుత్వ దురుద్దేశాలకు గట్టి ఎదురుదెబ్బ అని డీఎంకే నేత ఆర్.ఎస్. భారతి పేర్కొన్నారు.
