
న్యూస్ డెస్క్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారులోని సిగాచి ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం మరొక ఊహించని మలుపు తిరిగింది. శుక్రవారం ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహారాష్ట్రకు చెందిన కార్మికుడు భీమ్ రావు మృతిచెందడంతో మొత్తం మృతుల సంఖ్య 39కి పెరిగింది.
ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిటీ దర్యాప్తు వేగవంతం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని బృందం శుక్రవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించనుంది. ఒక వారం వ్యవధిలో ప్రాథమిక నివేదికను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటివరకు 31 మృతదేహాలను గుర్తించగా, 9 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదని కలెక్టర్ ప్రవీణ్య తెలిపారు. శిథిలాల నుంచి వెలికితీసిన 20 అస్థిపంజరాలను డీఎన్ఏ పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు వెల్లడించారు.
95 శాతం డీఎన్ఏ నమూనాలు సేకరణ పూర్తయిందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. గాయపడిన 33 మందిలో ఇప్పటివరకు 12 మంది డిశ్చార్జ్ అయినట్టు సమాచారం.
ప్రతి గాయపడిన వ్యక్తికి రూ. 1 లక్ష పరిహారం అందించామని పరిశ్రమ యాజమాన్యం తెలిపింది. జూన్ 30న టాబ్లెట్ పౌడర్ తయారీ సమయంలో ఈ భారీ పేలుడు సంభవించింది.