
న్యూస్ డెస్క్: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేల సందడి మామూలుగా ఉండదు. పల్లెలన్నీ పచ్చందాలతో కళకళలాడుతుంటే, బరుల దగ్గర మాత్రం పందెం రాయుళ్ల కేకలు మిన్నంటుతాయి.
ఏడాది పొడవునా సంపాదించిన దానికంటే, ఈ మూడు రోజుల్లో పందేల ద్వారా వచ్చే లాభనష్టాలే అక్కడ హాట్ టాపిక్. సంక్రాంతి సంబరాల్లో తన కోడి గెలిస్తే, ఒక రాజ్యమే గెలిచినంతగా గర్వపడుతుంటారు పందెం కోళ్ల యజమానులు.
ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో పందేల బరుల దగ్గర ముందస్తు ఏర్పాట్లు ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. దాదాపు పది రోజుల ముందు నుంచే తోటలను శుభ్రం చేసి, క్రికెట్ పిచ్ తరహాలో బరెల మైదానాలను సిద్ధం చేస్తున్నారు.
ఈసారి పందెం కోళ్ల శిక్షణ కూడా డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటర్ల రేంజ్‌లో సాగుతోంది. ఉదయాన్నే స్విమ్మింగ్, జీడిపప్పుతో బ్రేక్ ఫాస్ట్, రాగులు-సజ్జలతో లంచ్ ఇలా కోళ్లకు ప్రత్యేక డైట్ ఇస్తూ కదనరంగానికి సిద్ధం చేస్తున్నారు.
పందేల్లో గెలుపోటములను నిర్ణయించే అత్యంత కీలకమైన అంశం ‘కోడికి కత్తి కట్టడం’. ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కోడి కాలికి కత్తి కట్టే విధానంలోనే అసలైన నైపుణ్యం దాగి ఉంటుంది. ఆ కట్టులో ఏ చిన్న తేడా వచ్చినా కోడి బరిలో ఓడిపోయే ప్రమాదం ఉంది. అందుకే, కోడికి కత్తి కట్టే నిపుణులకు (నైపుణ్యం గల కట్టేవారు) ఇప్పుడు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ ఎక్స్‌పర్ట్స్‌కు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తి కావడం విశేషం.
హైదరాబాద్ నుంచి అమెరికా వరకు ఎక్కడున్న వారైనా సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో వాలిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కార్యాలయాల్లో సెలవుల కోసం ఇప్పుడే దరఖాస్తులు చేసుకుంటున్నారు. పందేల సందడి, కోళ్ల గర్జనలు ప్రత్యక్షంగా చూడాలని చాలామంది తహతహలాడుతున్నారు. ఈ రేంజ్ లో ముందస్తు ప్రణాళికలు చూస్తుంటే, ఈసారి సంక్రాంతి కోడి పందేలు ఏ స్థాయిలో జరగబోతున్నాయో అర్థమవుతోంది.
