
ఏపీ: కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆటవిక దేశాల్లో ఉండే నియంతృత్వ పాలనను రాష్ట్రంలో కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రెడ్ బుక్ పేరుతో పోలీసులను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
గుంటూరు జైలులో ఉన్న వైసీపీ నేతలు నందిగం సురేశ్, తురకా కిశోర్‌లను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలీసు వ్యవస్థ చట్టాలకు కాకుండా కూటమికి అనుకూలంగా పనిచేస్తోందని సజ్జల అన్నారు.
సామాన్యులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ అరెస్టులు, కేసులు నమోదు చేస్తున్న విధానాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బెయిల్‌పై బయటకు వచ్చినవారిపై వెంటనే పాత కేసులతో పీటీ వారెంట్లు అమలు చేస్తున్నారని ఆరోపించారు.
నందిగం సురేశ్‌పై ఇప్పటికే 12 కేసులు నమోదు చేశారని, ఒక్కసారి బయటకు వచ్చినా మరో కేసుతో వెంటనే జైలుకు పంపిస్తున్న తీరును సజ్జల ప్రజాస్వామ్యానికి ముప్పుగా అభివర్ణించారు.
ఈ చర్యలన్నీ ప్రజలపై భయాన్ని సృష్టించేందుకేనని విమర్శించిన సజ్జల, ఇది ప్రజాస్వామ్య పునాదులను చూలగొట్టడమేనని హితవు పలికారు.
