
న్యూస్ డెస్క్: టీడీపీ నేత, శాప్ చైర్మన్ రవి నాయుడు చేసిన వ్యాఖ్యలు తాజాగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరో 20 రోజుల్లో వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా జైలుకు వెళ్లే పరిస్థితి ఉంటుందని రవి నాయుడు అన్నారు. వైసీపీ హయాంలో రోజా, బైరెడ్డి సిద్ధార్థ్‌తో కలిసి కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.
ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలు వెనక్కి తీసుకున్నారని, ఆ క్రమంలో నాణ్యతలేని ఆట వస్తువులు ఎక్కువ ధరలకు కొనుగోలు చేసి కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం అంతర్గత విచారణ జరుగుతోందని, ఆధారాలతో నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఆడుదాం ఆంధ్రా విషయంపై విచారణ కొలిక్కి వచ్చిందని, రోజా అరెస్ట్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని ఆయన పేర్కొన్నారు. క్రీడా మంత్రిగా ప్రజల సొమ్ముతో ఆటాడిన వారు జైలుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
లిక్కర్ కుంభకోణానికి, ఆడుదాం ఆంధ్ర స్కాంలోనూ ఒకే తరహా మోసాలు జరిగాయని పేర్కొన్నారు. నాసిరకం వస్తువులు, అధిక ధరలకు కొనుగోలు, కంపెనీల నుంచి ముడుపులు తీసుకోవడం కలిసిపోయిందని వివరించారు.
వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ కొనసాగుతుందని, రోజా, సిద్ధార్థ్ రెడ్డిలపై అరెస్టు వారంట్లు త్వరలోనే వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.