
న్యూస్ డెస్క్: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఎదురవుతున్న ఎన్నికలు ఆయన భవిష్యత్తును నిర్ణయించే అగ్నిపరీక్షగా మారాయి. ఈ స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా తన నాయకత్వానికి తిరుగులేదని ఆయన నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు ఎన్నికల ఫలితాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రెఫరెండంగా రాజకీయ వర్గాలు చూస్తున్నాయి.
జూబ్లీహిల్స్‌లో గెలిస్తే, హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయొచ్చని సీఎం భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. ఎన్నికల తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనే ఖాతా తెరిచింది. అందుకే గ్రేటర్ ఎన్నికల ముందు జూబ్లీహిల్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలని రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, ఎన్నికల హామీలను సరిగా అమలు చేయడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అలాగే, తన మంత్రివర్గ సహచరులు కూడా సీఎం మాట లెక్క చేయడం లేదని, కాంగ్రెస్ అధిష్టానం కీలక శాఖలపై కత్తెర వేసిందని కూడా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
ఈ విమర్శల నేపథ్యంలో, ప్రభుత్వంలో తానే సుప్రీం పవర్ అని నిరూపించుకోవడం రేవంత్ రెడ్డికి చాలా అవసరం. స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటే, ప్రజల్లో తన పరపతి చెక్కుచెదరలేదని ముఖ్యమంత్రి నిరూపించుకోవచ్చు.
అయితే, ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికలను రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాటు వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు షెడ్యూల్ విడుదల కావడంతో, మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని పార్టీ మరింత బలపడిందని చూపించుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ నెలలో జరిగే స్థానిక ఎన్నికలు, ఆ తర్వాత జరగబోయే పంచాయతీ పోరు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక… ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకేసారి ఎదురైన పెద్ద సవాల్‌గా మారాయి. ఈ రెండింటిలోనూ పార్టీని విజయతీరాలకు చేర్చడం ద్వారా ఆయన తన నాయకత్వానికి బలమైన పునాది వేయాలని చూస్తున్నారు.
