న్యూస్ డెస్క్: తుంగతుర్తి నియోజకవర్గంలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నీళ్లు ఇవ్వలేకపోయారని, ఇప్పుడు తామివ్వబోతే మాత్రం అడ్డుకుంటామని మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేషన్ కార్డు పేదవాడికి గౌరవంగా మారిందని, 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. ఈ కారణంగా రేషన్ దుకాణాల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారని చెప్పారు.
వ్యవసాయం కష్టంగా మిగలకుండా, పండుగలా మారాలంటే గిట్టుబాటు ధరతోపాటు బోనస్ అవసరమని, తాము అదే చేస్తూ ఉన్నామని చెప్పారు.
వరి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ముందుంటుందని చెప్పారు. రైతుల శ్రమకు గౌరవం ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.
తుంగతుర్తికి నీళ్లు తేవడమే తమ ప్రాధాన్యత అని, మున్ముందు పథకాలతో ప్రజలకు మేలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.