
న్యూస్ డెస్క్: తెలంగాణ భారతీయ జనతా పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే టీ. రాజాసింగ్, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. “మీరు అక్కడ ఓడిపోతే కేంద్ర నాయకుల ముందు మొహం ఎలా చూపిస్తారు? త్వరలో మీకూ అదే గతి పడుతుంది,” అని రాజాసింగ్ కటువుగా విరుచుకుపడ్డారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు కమలనాథులలో ఆందోళన కలిగిస్తున్నాయి. “కిషన్ రెడ్డి గారూ, జూబ్లీహిల్స్‌లో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు? మీరు కాంగ్రెస్‌ను గెలిపిస్తారా లేక బీఆర్‌ఎస్‌కు సహాయం చేస్తారా?” అంటూ ఆయన ఓటమి భయాన్ని, కిషన్ రెడ్డి వ్యూహాత్మక వైఖరిని ప్రశ్నించారు.
రాజాసింగ్ చేసిన మరో సంచలన ఆరోపణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. “ఓవైసీతో మీకున్న ఒప్పందం వల్లనే ఎంఐఎం జూబ్లీహిల్స్‌లో పోటీ చేయడం లేదా?” అని ఆయన ప్రశ్నించారు. ఇది బీజేపీ, ఎంఐఎం మధ్య రహస్య అవగాహన ఉందన్న పరోక్ష ఆరోపణ.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం కిషన్ రెడ్డి పార్లమెంట్ పరిధిలోనే ఉంది. ఈ సమయంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని బలహీనపరిచేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక కేంద్రమంత్రిపై మాజీ ఎమ్మెల్యే బహిరంగంగా విమర్శలు చేయడం పార్టీ చరిత్రలోనే చాలా అరుదు.
గతంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురికావడం, ఇటీవల రాజీనామా చేయడం వెనుక కిషన్ రెడ్డి పాత్ర ఉందని రాజాసింగ్‌లో బలంగా భావన ఉంది. ఈ కారణాల వల్లే ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. అంతర్గత కలహాలతో సతమతమవుతున్న బీజేపీ ఈ ఉప ఎన్నికను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
