
న్యూస్ డెస్క్: వరుస పరాజయాలు సంస్థాగత బలహీనతల మధ్య కాంగ్రెస్‌లో మరోసారి నాయకత్వ మార్పు చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై వయసు ఆరోగ్య కారణాల భారం పెరిగిందన్న వాదన బలపడుతోంది. పార్టీకి ఇప్పుడు రాజకీయంగా దూకుడు సంస్థాగతంగా పట్టు ఉన్న కొత్త ముఖచిత్రం అవసరమని అధిష్టానం భావిస్తోంది.
ఈ పరిస్థితుల్లో ప్రియాంక గాంధీకి ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే ఆలోచన రాజకీయ వేదికపైకి వచ్చింది. ఇందిరా గాంధీని తలపించే ధైర్యమైన వాక్ చాతుర్యం, జనసమూహాన్ని ఆకట్టుకునే శైలి ఆమెకు అదనపు బలం. ఉత్తరప్రదేశ్‌లో ఆమె పోరాటం తక్షణ ఫలితాలు ఇవ్వకపోయినా, కేడర్‌లో నమ్మకాన్ని పునరుద్ధరించిందనే అభిప్రాయం ఉంది.
ఈ పరిణామాల నేపథ్యంలో పలువురు సీనియర్ నేతలు సోనియా గాంధీకి లేఖలు రాసినట్టు సమాచారం. నాయకత్వ మార్పు అవసరమని కొత్త శక్తి పార్టీకి ఊపునిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. కఠిన పరిస్థితుల్లో పార్టీని ఏకం చేయగలిగే సామర్థ్యం ఇప్పటికీ గాంధీ కుటుంబానికే ఉందని మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
ప్రియాంక నాయకత్వం వహిస్తే, పార్టీ ముందు కొన్ని తక్షణ కర్తవ్యాలు ఉంటాయి. రాష్ట్ర యూనిట్లకు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం, యువ నాయకత్వాన్ని ముందుకు తేవడం, ఎన్నికల వ్యూహాలను డేటా ఆధారంగా రూపొందించడం వంటివి కార్యాచరణలో కనిపించాలి. సాహసోపేతమైన మార్పు లేకపోతే పరాజయాల చక్రం కొనసాగుతుందన్న భయం కేడర్‌లో ఉంది. ప్రియాంక పేరు ఆ భయానికి ఆశగా మారవచ్చు.
