Tuesday, March 17, 2026
HomeAndhra Pradeshపేర్ని నాని అరెస్టుకు రంగం సిద్ధం? నాన్ బెయిలబుల్ కేసు!

పేర్ని నాని అరెస్టుకు రంగం సిద్ధం? నాన్ బెయిలబుల్ కేసు!

perni-nani-non-bailable-case-arrest-speculation-3102bc

న్యూస్ డెస్క్: వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని అరెస్టు అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. పోలీసు విధులకు ఆటంకం కలిగించడం, దురుసుగా ప్రవర్తించడం వంటి అభియోగాలపై పేర్ని నానితో పాటు మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వీటిలో కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉండటం వల్ల పేర్ని అరెస్టు తప్పదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏ విధంగానైనా పేర్నిని జైలుకు పంపాలనే ఆలోచనతో ఉండగా, సీఐతో దురుసుగా ప్రవర్తించి పేర్ని స్వయంగా ఈ పరిస్థితులను కల్పించుకున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది.

ఇప్పటికే రేషన్ బియ్యం అక్రమ తరలింపు కేసులో పేర్ని నాని ముందస్తు బెయిలుపై ఉన్నారు. తాజాగా నమోదైన ఈ కేసుతో ఆయనకు అరెస్టు ముప్పు పెరిగింది.

శుక్రవారం రాత్రి ఈ విషయంపై స్పందించిన క్రిష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, మాజీ మంత్రి పేర్ని నానితో పాటు దీనికి సంబంధించిన ఇతరులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

“ఇలాంటి పద్ధతులను క్షమించేది లేదు. ఏ పార్టీ వారైన చర్యలు తప్పవు” అంటూ ఎస్పీ మీడియాకు స్పష్టం చేశారు. సీఐ ఏసుబాబుతో పేర్ని నాని దురుసుగా ప్రవర్తించారన్న కేసులో అరెస్టులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

వైసీపీ మచిలీపట్నం నగర శాఖ అధ్యక్షుడు మేకల వెంకట సుధాకర్ అలియాస్ సుబ్బన్నను శుక్రవారం ఆర్.పేట పోలీసులు అరెస్టు చేశారు. దీనికి నిరసనగా ఆయన్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో వందల మంది కార్యకర్తలు పోలీసుస్టేషన్ వద్ద ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని సీఐ చాంబర్‌లోకి అక్రమంగా చొరబడ్డారు. సీఐతో దురుసుగా ప్రవర్తించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. మెడికల్ కాలేజీ వద్ద ధర్నాకు అనుమతి లేదని చెప్పినా, వైసీపీ నేత సుబ్బన్న పోలీసులకు సహకరించవద్దని వాట్సాప్ సందేశాలు పంపినట్లు తమ దృష్టికి వచ్చిందని ఎస్పీ వివరణ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular