
న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన, క్షేత్రస్థాయిలో పరిపాలనను బలోపేతం చేసే దిశగా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. గురువారం అధికారులతో నిర్వహించిన సుదీర్ఘ సమీక్షలో, గ్రామీణ వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు.
ఇందులో అత్యంత కీలకమైనది ‘క్లస్టర్ విధానాన్ని’ రద్దు చేయడం. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 13,351 గ్రామ పంచాయతీలు ఇకపై దేనికదే స్వతంత్ర యూనిట్లుగా పనిచేస్తాయి. ఇది గ్రామీణులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, మెరుగ్గా అందేందుకు దోహదపడుతుంది.
ఈ పాలనా సంస్కరణల ఫలాలను ప్రజలకు నేరుగా చేర్చేందుకు, నవంబర్ 1వ తేదీ నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారి (DDO) కార్యాలయాలను ప్రారంభించాలని పవన్ అధికారులను ఆదేశించారు. పాలనను ప్రజల ముంగిటకు తీసుకెళ్లడమే దీని ప్రధాన లక్ష్యం.
పల్లెల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణాభివృద్ధికి నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
కూటమి ప్రభుత్వం సంస్కరణల పట్ల సానుకూలంగా ఉందని, అయితే ఆ ఫలితాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన పూర్తి బాధ్యత అధికారులపైనే ఉందని పవన్ అన్నారు. ‘పల్లె పండగ 2.0’ కార్యక్రమం ద్వారా చేపట్టే అభివృద్ధి పనులపై ప్రణాళికలు సిద్ధం చేయాలని, నిధుల వినియోగాన్ని ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, పంచాయతీ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఓటు బ్యాంకుపై పూర్తి పట్టు సాధించాలన్నది పవన్ కళ్యాణ్ వ్యూహంగా స్పష్టమవుతోంది.
