
న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధిపై తన దృష్టిని స్పష్టం చేశారు. మంగళగిరిలో పంచాయతీరాజ్ ఉద్యోగులతో సమావేశం సందర్భంగా, తాను అడిగి మరీ ఈ శాఖను తీసుకోవడానికి గల కారణాన్ని వివరించారు.
దేశానికి పల్లెలే నిజమైన వెన్నెముక అని నమ్ముతానని, అందుకే గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నట్లు పవన్ తెలిపారు. తాగునీరు, రోడ్లు, ఉపాధి హామీ వంటి సమస్యలపై అధికారులు ఆలోచించాలని కోరారు.
గత ఏడాదిన్నర కాలంలో కూటమి ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిందని, అధికారుల సమన్వయంతోనే ఇది సాధ్యమైందని పవన్ అన్నారు. తన సొంత నిర్ణయాల కంటే అధికారుల అనుభవానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
పంచాయతీరాజ్ శాఖలో దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, సిఫార్సులు లేకుండా పది వేల మందికి పైగా పదోన్నతులు కల్పించామని పవన్ తెలిపారు. పారదర్శకతలో భాగంగా పంచాయతీ కార్యదర్శి పేరును ‘పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్’గా మార్చామని వివరించారు.
ఉద్యోగులకు సరైన శిక్షణ ఇచ్చి ఏపీని కెపాసిటీ బిల్డింగ్‌లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టామని పవన్ చెప్పారు. ప్రజలే తమ ప్రభుత్వానికి ప్రధానమని, ఈ కూటమి మరో 15 ఏళ్లు స్థిరంగా ఉంటుందని ఆయన ఉద్యోగులకు భరోసా ఇచ్చారు.
