
న్యూస్ డెస్క్: తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ శకం మొదలైందా? పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన పట్టు బిగిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటివరకు నాయకులంతా చంద్రబాబుకు మాత్రమే భయభక్తులతో ఉండేవారు. కానీ ఇప్పుడు, అదే భయం, భక్తిని మంత్రి నారా లోకేష్ పట్ల కూడా ప్రదర్శిస్తుండటం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో లోకేష్ తన వైఖరిని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండని నేతలపై, పార్టీ గీత దాటి ప్రవర్తిస్తున్న వారిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీకు అంత నమ్మకం ఉంటే, స్వతంత్రంగా పోటీ చేసి గెలవండి” అంటూ కుండబద్దలు కొట్టారు.
లోకేష్ హెచ్చరికల గురించి కొందరు నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ, “లోకేష్ హెచ్చరికలు అందరికీ వర్తిస్తాయి. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాల్సిందే” అని గట్టిగా చెప్పినట్లు సమాచారం. ఇది లోకేష్‌కు చంద్రబాబు ఇచ్చిన పూర్తి మద్దతుగా నాయకులు భావిస్తున్నారు.
చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, లోకేష్ మాటలకు విలువనిస్తూ ఆయనకు మద్దతుగా నిలవడం ద్వారా, పార్టీపై పూర్తి అధికారాలను (ఫుల్ పవర్స్) కట్టబెట్టినట్లేనని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
ఇప్పటివరకు చంద్రబాబు సెంట్రిక్‌గా సాగిన పార్టీ వ్యవహారాలు, ఇకపై లోకేష్ అజమాయిషీలో కూడా కొనసాగుతాయని స్పష్టమవుతోంది. పార్టీని క్రమశిక్షణలో పెట్టే బాధ్యతను లోకేష్ తీసుకున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.
