
న్యూస్ డెస్క్: ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కానూరు సివిల్ సప్లై భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, జగన్‌కు ప్రజల తీర్పుపై అవగాహన లేదని మండిపడ్డారు. “రైతుల కోసం ఏం చేశారో చెప్పండి.. చర్చకు సిద్ధమా?” అంటూ సవాల్ విసిరారు.
మునుపటి వైసీపీ ప్రభుత్వ హామీలు అమలుకాకుండా పోయాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల బకాయిలను తీర్చిందని ఆయన చెప్పారు. ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.12,857 కోట్ల ధాన్యం కొనుగోలు చేయగా, రూ.12,000 కోట్లు 24 గంటల్లో జమ చేశామన్నారు.
జగన్ బెంగళూరులో ఉండి నెలలో ఒక్కసారి వచ్చి ప్రజల మధ్య చీలిక తెచ్చేలా మాట్లాడుతున్నారని, ఇది బాధాకరమని విమర్శించారు. చిత్తూరు పర్యటనను రాజకీయ ప్రయోజనంగా మార్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
పవిత్రమైన పంటను ట్రాక్టర్లతో తొక్కించడమే జగన్ పాలన అసలు రూపం అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులపై స్పష్టతతో ముందుకు పోతుందని తెలిపారు.
మంచి పాలన, రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. జగన్ మళ్లీ అవాస్తవాల ప్రచారం చేయడం ప్రజలు తిప్పికొడతారని వ్యాఖ్యానించారు.