
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ఇప్పటికే 2023లో 10,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన ఈ సంస్థ, ఇప్పుడు మరోసారి ప్రపంచవ్యాప్తంగా సిబ్బందిలో 3% మందిని ఉద్యోగాల నుంచి తొలగించబోతోందని సమాచారం.
2023 జూన్ నాటికి మైక్రోసాఫ్ట్‌లో 2.28 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. తాజా కోత ప్రకారం, దాదాపు 6,800 మందిపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఈ ఉద్యోగుల తొలగింపులు ఏ విభాగాల్లో జరుగనున్నాయనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
సీఎన్బీసీతో మాట్లాడిన మైక్రోసాఫ్ట్ ప్రతినిధి మాట్లాడుతూ, మార్కెట్ పోటీని దృష్టిలో ఉంచుకుని సంస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మేనేజ్మెంట్ స్థాయిల నుంచి వ్యయ నియంత్రణ చర్యలను ముమ్మరం చేయాలని సంస్థ భావిస్తోంది.
తాజా లేఆఫ్‌లు పనితీరు ఆధారంగా కాకుండా, వ్యూహాత్మక మార్పుల భాగంగా తీసుకున్న నిర్ణయమని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. జనవరిలో కూడా కొన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను సంస్థ బయటకు పంపిన విషయం తెలిసిందే.
ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలోని ఉద్యోగ భద్రతపై మళ్లీ అనేక ప్రశ్నలు తెరపైకి తెస్తోంది.