
న్యూస్ డెస్క్: అమెరికా పోల్ స్టర్, రాస్ ముస్సేన్ సీఈవో మార్క్ మిచెల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హెచ్1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులను అక్రమ వలసదారులతో పోల్చడం విద్వేషానికి పరాకాష్టగా నిలుస్తోంది.
డిమాండ్ ఉన్న చోట మాత్రమే సప్లయి ఉంటుంది. అమెరికాకు మేధోసంపత్తి అవసరం ఉంది కాబట్టే, ఇండియన్లు అక్కడకు వెళ్తున్నారు. ఆ దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములవుతూ, పన్నులు చెల్లిస్తున్నారు. అయినా కూడా వారి చట్టబద్ధమైన స్థితిని అక్రమ వలసదారులతో పోల్చడం సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం.
ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మార్క్ మిచెల్, ఒక హెచ్1బీ ఉద్యోగి పది మంది అక్రమ వలసదారులతో సమానం అని దారుణంగా వ్యాఖ్యానించారు. సిలికాన్ వ్యాలీలోని కంపెనీలు తక్కువ వేతనానికి వచ్చే ‘థర్డ్ వరల్డ్ ఇంజనీర్లను’ అమెరికన్ల స్థానంలో తీసుకొచ్చి భారీగా దోపిడీ చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
మిచెల్ మాటల్లో కంపెనీల విధానాలపై ఆగ్రహం ఉన్నప్పటికీ, వీసాపై చట్టబద్ధంగా వచ్చిన వారిని బానిసలుగా, దేశ విద్రోహులుగా చూడటం మానవీయ విలువలకు విరుద్ధం. వాస్తవానికి, తమ మేధోసంపత్తిని వేరే దేశానికి ధారపోస్తున్నందుకు బాధపడాల్సింది భారత్ అని నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలోని టెక్ ఉద్యోగుల్లో 66 శాతం మంది విదేశీయులే ఉన్నారు. వారిలో 23 శాతం మంది భారతీయులు ఉన్నారు. అమెరికన్ కంపెనీలు భారతీయులనే ఎంచుకుంటున్నాయంటే, స్థానికుల ప్రతిభ ఏ స్థాయిలో ఉందో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాణిజ్య సూత్రం ప్రకారం ఏ కంపెనీ అయినా లాభాలనే చూస్తుంది తప్ప, జాతీయాన్ని కాదని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
