
న్యూస్ డెస్క్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా హైదరాబాద్ లో సందడి చేశారు. కోల్ కతాలో కొన్ని అడ్డంకులు ఎదురైనా, తెలంగాణ ప్రభుత్వం ఈ ఈవెంట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉప్పల్ స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య విజయవంతంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో మెస్సీ క్రీడాకారులను కలిసి, వారితో ముచ్చటించి, ఒక స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్ లో పాల్గొన్నారు.
ముఖ్యంగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెస్సీ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ‘సింగరేణి ఆర్ఆర్ టీం’ తరపున, మెస్సీ ‘ఆపర్ణ టీమ్’ తరపున బరిలోకి దిగారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మెస్సీ, రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించుకున్నారు.
ఈ మ్యాచ్ లో సీఎం రేవంత్ రెడ్డి అద్భుతంగా ఒక గోల్ కొట్టగా, దానికి ప్రతిగా మెస్సీ రెండు గోల్స్ చేశారు. అనంతరం పెనాల్టీ షూటౌట్ లో రేవంత్ రెడ్డి గోల్ కొట్టినప్పుడు మెస్సీ చప్పట్లు కొట్టి అభినందించడం హైలైట్‌గా నిలిచింది.
మ్యాచ్ ముగిశాక మెస్సీ, రేవంత్ రెడ్డి ఇద్దరూ స్టేడియంలో కలియ తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. అభిమానులకు గిఫ్ట్‌గా మెస్సీ ఫుట్‌బాల్ ను కిక్ చేసి ఇచ్చారు. కోల్ కతాలో మాదిరిగా కాకుండా ఉప్పల్ స్టేడియంలో పటిష్ట భద్రత మధ్య పిల్లలతో కలిసి మెస్సీ సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. సీఎం రేవంత్ రెడ్డి తన మనవడిని పరిచయం చేయగా, వారితోనూ మెస్సీ ఆడి ఫొటో దిగారు.
ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ ను కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీతోపాటు, ప్రియాంక గాంధీ కుమారుడు, కుమార్తె కూడా వీక్షించారు.
