Sunday, July 19, 2026
HomeAndhra Pradesh2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు.. ఎప్పటి నుంచంటే?

2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు.. ఎప్పటి నుంచంటే?

godavari-pushkarams-2027-dates-announced-june-26-to-july-7

న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2027లో నిర్వహించబోయే గోదావరి పుష్కరాల తేదీలను ఖరారు చేసింది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు మొత్తం 12 రోజులపాటు ఈ పుష్కరాలు జరగనున్నాయి.

టీటీడీ ఆస్థాన సిద్ధాంతి అభిప్రాయం మేరకు, విజయవాడ ఎండోమెంట్స్ కమిషనర్ ప్రతిపాదనలను ఆమోదించి ప్రభుత్వం ఈ తేదీలను ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఈ పుష్కరాలు మూడోసారి జరుగుతుండడం విశేషం.

గోదావరి నది ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో ప్రవహిస్తుంది. గతంలో 2015లో జరిగిన పుష్కరాల్లో 5.20 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

ఈసారి భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రోజుకు దాదాపు 75 లక్షల యాత్రికులు స్నానం చేస్తారని భావిస్తున్నారు. అందుకే కుంభమేళా స్థాయిలో ఏర్పాట్లు చేయడానికి కసరత్తు చేస్తున్నారు.

13 రాష్ట్ర శాఖలతో రైల్వేశాఖ కలిపి మొత్తం 14 శాఖలు ఈ ఏర్పాట్లలో పాల్గొంటాయి. గత పుష్కరాల్లో 202 ఘాట్లు ఏర్పాటు చేయగా, ఈసారి భక్తుల సంఖ్యకు అనుగుణంగా మరిన్ని ఘాట్లను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే దేవాదాయ శాఖకు రూ.2,105 కోట్లు విడుదల చేశారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంత్రులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం ఇద్దరు సీనియర్ ఐఏఎస్ లను ప్రత్యేకాధికారులుగా నియమించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular