
తెలంగాణ: రాజకీయాల్లో గత రెండేళ్లుగా సైలెంట్ గా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచారు. కృష్ణా నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఇక ఊరుకునేది లేదని ఆయన గర్జించారు. జనంలోకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తానని, మూడు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని కేసీఆర్ హెచ్చరించారు. అయితే, దీనికి కౌంటర్ గా సీఎం రేవంత్ రెడ్డి “బయట కాదు.. దమ్ముంటే అసెంబ్లీకి రా.. అక్కడే తేల్చుకుందాం” అంటూ సవాల్ విసిరారు.
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి కేసీఆర్ సభకు హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారినా, ఆయన వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రజల సమస్యలపై, ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ వెనక్కి రావడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటే అసెంబ్లీనే సరైన వేదిక అని కేసీఆర్ భావిస్తున్నారట.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే, ఆయన స్టైల్ లో ‘పవర్ పాయింట్ ప్రజెంటేషన్’ ద్వారా నీటి లెక్కలు తేల్చాలని చూస్తున్నారట. గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఇలాగే అనేక అంశాలపై ఆయన ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో ఆయన ఇచ్చే ప్రజెంటేషన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అనేది చూడాలి.
రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరించి కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెడితే, ఈ సెషన్ లో మాటల యుద్ధం తారస్థాయికి చేరడం ఖాయం. అసెంబ్లీ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నడుపుతామని రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో చాలా రోజుల తర్వాత కేసీఆర్, రేవంత్ రెడ్డి ఫేస్ టూ ఫేస్ తలపడే అరుదైన దృశ్యం కోసం తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
