
న్యూస్ డెస్క్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న వేళ, ఓ ఆసక్తికరమైన విచిత్రం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే, ఈ నియోజకవర్గ పరిధిలో అసలు ‘జూబ్లీహిల్స్’ అనే మున్సిపల్ డివిజనే లేదు! అయినా సరే, ఈ స్థానానికి ఆ పేరే పెట్టడం గమనార్హం.
2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఎర్రగడ్డ, బోరబండ, యూసుఫ్‌గూడ, వెంగళరావు నగర్, రెహమత్ నగర్, షేక్‌పేట్ డివిజన్లు ఉన్నాయి. ఇవి ఎక్కువగా పేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు, మైనారిటీలు నివసించే ప్రాంతాలు. సంపన్నులు, సెలబ్రిటీలు ఉండే అసలైన జూబ్లీహిల్స్ డివిజన్ మాత్రం ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.
దీంతో, జూబ్లీహిల్స్‌లో నివాసం ఉండే సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, సినీ తారలు చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు వంటి ప్రముఖులకు ఈ ఉప ఎన్నికలో ఓటు హక్కు లేదు. వారి ఓట్లన్నీ ఖైరతాబాద్ పరిధిలోనే ఉన్నాయి.
అయితే, ఈ నియోజకవర్గ ఫలితాన్ని ప్రభావితం చేసేది సెలబ్రిటీలు కాదు, ఇక్కడే నివసించే సామాన్య ప్రజలు, ముఖ్యంగా సినీ పరిశ్రమ కార్మికులు. యూసుఫ్‌గూడ, రెహమత్ నగర్ వంటి ప్రాంతాల్లో వేలాది మంది సినీ కార్మికులు నివసిస్తున్నారు, వారి ఓట్లు ఇక్కడే ఉన్నాయి.
కాబట్టి, పేరుకు ‘జూబ్లీహిల్స్’ అయినా, ఇక్కడి రాజకీయాలు, గెలుపోటములను నిర్ణయించేది మాత్రం అక్కడి వీఐపీలు కాదు, ఈ ఆరు డివిజన్ల పరిధిలోని సాధారణ ఓటర్లే. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు, నియోజకవర్గం పేరుకు, అక్కడి వాస్తవ పరిస్థితులకు పొంతన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఈ ఉప ఎన్నిక తీర్పులో సినీ కార్మికులు, స్థానిక బస్తీ ప్రజల ఓట్లే అత్యంత కీలకం కానున్నాయి. ప్రముఖుల పేర్లతో ముడిపడినప్పటికీ, వారి ఓట్లు లేని ఈ నియోజకవర్గంలో అసలైన ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి.
