
ఇరాక్‌లోని అల్-కుత్ నగరాన్ని ఘోర విషాదం వెంటాడింది. నగరంలోని ఒక హైపర్‌మార్కెట్‌లో గడిచిన రాత్రి తీవ్ర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 50 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వాసిత్ ప్రావిన్స్ గవర్నర్ మొహమ్మద్ అల్-మియాహి తెలిపారు.
ఇప్పటికే సంఘటనకు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. భవనం భారీగా మంటల్లో చిక్కిన దృశ్యాలు, పొగలతో నిండిపోయిన పరిసరాలు కంటికెదురవుతున్నాయి. అయితే, ఈ వీడియోల ప్రామాణికతను అధికారులు ఇంకా ధృవీకరించలేదు.
ఈ ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు ఫలితాలు రెండు రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉందని ఇరాక్ అధికార మీడియా సంస్థ ఐఎన్ఏ తెలిపింది.
దుర్ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక దళం రంగంలోకి దిగింది. భారీగా మంటలు వ్యాపించడంతో సహాయక చర్యలు తడబడినట్టు సమాచారం. ఇప్పటిదాకా మృతి చెందినవారిలో చాలామంది చిన్న పిల్లలే ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, స్థానికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విషాద ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తమవుతోంది.