
న్యూస్ డెస్క్: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన ఎగ్జిబిషన్ గేమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ ఈవెంట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.
ముఖ్యంగా, ఈవెంట్ దాదాపుగా పరిపూర్ణంగా జరగడంతో దేశవ్యాప్తంగా ఉన్న మెస్సీ అభిమానులు హైదరాబాద్ ను చూసి మురిసిపోతున్నారు. అంతకుముందు కోల్‌కతాలో నిర్వహించాల్సిన కార్యక్రమం అభిమానుల నిరసనలతో పూర్తిగా విఫలమైంది. కానీ హైదరాబాద్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా విజయవంతమైంది.
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ:
సీఎం రేవంత్ రెడ్డి ఈ ఈవెంట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించారు. ఇందులో ఒక చిన్న కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్టేడియంలో పరేడ్ జరుగుతున్నప్పుడు మెస్సీ దగ్గరకు ఎవరినీ రాకుండా చూసుకున్నారు. దీని ద్వారా స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్క అభిమాని మెస్సీని స్పష్టంగా చూడగలిగేలా చేశారు. ముఖ్యమంత్రి చేసిన ఈ చిన్నపాటి జాగ్రత్త సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.
భారీ సంఖ్యలో అభిమానులు హాజరైనా, ఎక్కడా ఎలాంటి గొడవలు జరగకపోవడం ఈ ఈవెంట్ కు దక్కిన అతిపెద్ద విజయం.
దీదీ సర్కార్ పై ఫ్యాన్స్ ఆగ్రహం:
హైదరాబాద్ ఈవెంట్ విజయవంతం కావడంతో, అభిమానులు కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్‌ను దారుణంగా నిర్వహించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (దీదీ) నాయకత్వంపై మండిపడుతున్నారు. ఇటువంటి పెద్ద ఈవెంట్లను నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు నేర్చుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.
