న్యూస్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర ప్రమాదం దేశాన్ని కలచివేసింది. బిలాస్‌పూర్ జిల్లా, ఝండూత్ ప్రాంతంలోని బాలుఘాట్ సమీపంలో భారీ కొండచరియలు జారిపడి పర్యాటక బస్సుపై బండరాళ్లు, మట్టి పెళ్లలు కూలిపోయాయి.
ఈ ఘటనలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ‘సంతోషి’ అనే ప్రైవేట్ బస్సు ఆ సమయంలో మరోటన్ ఘుమర్విన్ మార్గంలో ప్రయాణిస్తోంది.
అకస్మాత్తుగా భారీ రాళ్లు, మట్టి దూసుకొచ్చి బస్సును పూర్తిగా కప్పేశాయి. బస్సులో 30మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో డ్రైవర్, కండక్టర్ కూడా ఉన్నారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసు, రెస్క్యూ టీములు ఘటనా స్థలానికి చేరుకొని శిథిలాలను తొలగించే పనిని ప్రారంభించాయి. ఇప్పటివరకు 15 మృతదేహాలను వెలికితీసి, ముగ్గురిని ప్రాణాలతో రక్షించారు. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చీకటి, వర్షం కారణంగా రెస్క్యూ పనులు అంతరాయానికి గురవుతున్నాయి.
ప్రభుత్వం మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపి, ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ప్రకటించింది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొండప్రాంతాల్లో ప్రయాణించే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
