
న్యూస్ డెస్క్: పార్లమెంట్‌లో ఎన్నికల సంస్కరణలపై జరిగిన రెండు రోజుల చర్చ, దేశంలో హాట్ టాపిక్ గా మారింది. విపక్ష పార్టీలన్నీ ఈవీఎంల పనితీరు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్)పై మూకుమ్మడిగా అనుమానాలు వ్యక్తం చేశాయి.
ప్రధానంగా ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారని, దీనివల్లే బీజేపీ గెలుస్తోందని విపక్షాలు ఆరోపించాయి. ఈవీఎంలను పక్కనపెట్టి, తిరిగి పేపర్ బ్యాలెట్ ను ప్రవేశపెట్టాలని వైసీపీతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
లోక్ సభలో ఈ అంశంపై రాహుల్ గాంధీ, అమిత్ షా మధ్య భారీ డైలాగ్ వార్ నడిచింది. నకిలీ ఓట్ల అంశాన్ని రాహుల్ లేవనెత్తగా, అమిత్ షా దీటుగా సమాధానం చెప్పారు. అయితే తాము అడిగిన నకిలీ ఓట్ల సమస్యకు సరైన సమాధానం రాలేదని విపక్షాలు అంటున్నాయి.
ఈవీఎంలపై విపక్షాలు సందేహాలు వ్యక్తం చేయగా, అధికార పక్షం మాత్రం కాంగ్రెస్ హయాంలోనే అవి వచ్చాయని గుర్తు చేసింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మరింత పకడ్బందీగా వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.
ఈవీఎంలపై, సర్ పై విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం గట్టిగా సమాధానం ఇచ్చింది. కానీ ఆ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు కీలకంగా మారింది.
అంతా కోరుతున్నట్లుగా ప్రభుత్వం తిరిగి పేపర్ బ్యాలెట్ వైపు వెళ్తుందా? లేక సర్ విషయంలో మరింత పారదర్శకతను తీసుకొస్తామని చెబుతుందా అనేది చూడాలి. ఎన్నికల సంస్కరణలపై ప్రభుత్వం ఎలాంటి వైఖరి తీసుకుంటుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు.
