
న్యూస్ డెస్క్: విడాకుల భరణం అనేది సంపద పెంచుకునే మార్గం కాదని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో, సొంతంగా సంపాదించుకునే భార్యకు భర్త నుంచి భరణం పొందాల్సిన అవసరం లేదని సంచలన తీర్పు వెలువరించింది.
ఈ కేసు వివరాల్లోకి వెళితే, ఓ న్యాయవాది, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (IRTS)లో గ్రూప్-ఎ అధికారిణిగా పనిచేస్తున్న ఉన్నతాధికారిణి 2010లో వివాహం చేసుకున్నారు.
అయితే, వారి వైవాహిక బంధం కేవలం 14 నెలలకే ముగిసింది. తన భార్య క్రూరంగా ప్రవర్తిస్తోందంటూ భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా, కోర్టు విడాకులు మంజూరు చేసింది.
అదే సమయంలో, శాశ్వత భరణం కోసం భార్య పెట్టుకున్న అభ్యర్థనను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సదరు మహిళా అధికారిణి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
విడాకులకు అంగీకరించాలంటే తనకు రూ. 50 లక్షలు చెల్లించాలని ఆమె డిమాండ్ చేసిన విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. ఇందులో స్పష్టమైన ఆర్థిక కోణం కనిపిస్తోందని అభిప్రాయపడింది.
భార్య ప్రభుత్వ ఉన్నతాధికారిణిగా మంచి జీతం ఆర్జిస్తున్నారని, వారికి పిల్లలు లేరని, కలిసి ఉన్నది కొద్దికాలమేనని పేర్కొంటూ ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. నిజంగా ఆర్థిక సహాయం అవసరమైన వారే భరణానికి అర్హులని కోర్టు స్పష్టం చేసింది.
