
ఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో భద్రతను పటిష్టం చేశారు. ఈ చర్యల ప్రభావంగా, ఆదివారం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 100 విమాన సర్వీసులు రద్దయ్యాయి.
దీనితో ప్రయాణికులు భారీగా అసౌకర్యానికి లోనయ్యారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు జరిగిన రద్దుల్లో 96 దేశీయ, ఒక అంతర్జాతీయ సర్వీసు ఉండటం గమనార్హం.
‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం సరిహద్దు గగనతల కదలికలు కట్టుదిట్టం చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
దిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) ప్రకారం, విమానాశ్రయం సాధారణంగా పనిచేస్తున్నప్పటికీ, భద్రతా నియమాల కారణంగా షెడ్యూళ్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
ప్రయాణికుల భద్రతే ముఖ్యమని స్పష్టం చేసిన అధికారులు, ఎలాంటి అపోహలకు లోనవకూడదని సూచించారు. ప్రయాణానికి ముందు తమ విమాన సంస్థలతో సమాచారం తెలుసుకోవాలని సూచించారు.
ఈ పరిణామం ‘ఆపరేషన్ సిందూర్’ ప్రభావాన్ని వివిధ రంగాల్లో చూస్తున్నట్టు స్పష్టమవుతోంది. ప్రయాణికులకు అప్‌డేట్స్ కోసం ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలన్నారు.
