ప్రముఖ నటి సరోజాదేవి మృతి సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎన్నో భాషల్లో నటించి చిరస్థాయిగా నిలిచిన ఆమె 1938లో జన్మించి, 1955లో సినిమాల్లోకి అడుగుపెట్టారు.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 200కి పైగా సినిమాలు చేసిన ఆమెకు గొప్ప నటిగా పేరుంది. తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో ఎంజీఆర్, కన్నడలో రాజ్ కుమార్లతో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు.
ఆమె మరణంపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. సినీ ఇండస్ట్రీకి ఇది తీరని లోటని భావించారు. తన తండ్రి ఎన్టీఆర్తో 20 సినిమాల్లో జోడీగా నటించడం ఆమె ప్రత్యేకత అన్నారు.
సరోజాదేవి లాంటి నటి చాలా అరుదుగా జన్మిస్తారన్నారు బాలయ్య. ఆమెతో నటించిన సినిమాలన్నీ గుర్తుండిపోతాయని ఆయన చెప్పారు.
భారత సినీ రంగం ఒక గొప్ప ఆభరణాన్ని కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు.
బి.సరోజాదేవి చేసిన సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. ఆమె అందించిన విలువైన కృషి సినిమాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.