
న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 16 నుంచి (మంగళవారం) ప్రారంభం కావాల్సి ఉంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు గతంలో ప్రకటన చేశారు. కానీ అనూహ్యంగా ఈ సమావేశాలు వాయిదా పడినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పుడు నిర్వహిస్తారు అనేది ఇంకా తేల్చలేదు. ఈ వాయిదాకు కారణాలు ఏమై ఉండొచ్చు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం కీలకమైన అంశాల్లో ప్రభుత్వానికి కొంత ఇబ్బంది ఎదురవుతున్న మాట వాస్తవం. సమావేశాలు పెడితే ఆయా అంశాలను ప్రస్తావించకుండా సభను ముగించడానికి అవకాశం ఉండదు. ఇందులో రాజధానికి చట్టబద్ధత అంశంపై బిల్లు చేయాల్సి ఉంది. రెండోది రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. మద్దతు ధరలు, ఎరువులు, పురుగు మందులు, నాణ్యమైన విత్తనాల విషయంలో ప్రభుత్వం వెనుకబడిందని చెప్పాలి.
కేంద్ర ప్రభుత్వం సంప్రదాయ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఎరువులు పురుగుమందులు తగ్గించే దిశగా అడుగులు వేయడంతో, ఈ ప్రభావం ఏపీతో సహా అన్ని రాష్ట్రాలపై పడింది. ఫలితంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తి విషయంలో తీవ్ర పరిణామాలు ఎదురవగా, తుఫాను నష్టపోయిన రైతులకు పరిహారం కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఈ అంశాలన్నీ అసెంబ్లీలో చర్చకి వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యలు పరిష్కారమయ్యే వరకు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
అదేవిధంగా రాజధాని అమరావతిపై చట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. అయితే దీనికి సంబంధించి రాష్ట్రంలోనే బిల్లు తయారుచేసి పంపాలని కేంద్రం చెప్పింది. గతంలో సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లును తయారుచేసి కేంద్రానికి పంపిస్తే ఆమోదించే అవకాశం ఉంటుంది.
రాజధాని సరిహద్దుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత కొరవడింది. గతంలో 53 వేల ఎకరాలలో అమరావతిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు మరో 46 వేల ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిస్థితులు కొలిక్కి రాలేదు. ఆయా సమస్యల నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు జనవరి రెండో వారం నుంచి నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప సమావేశాలకు వచ్చే పరిస్థితి ఉండదని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు.
