
ఆంధ్రప్రదేశ్: మెట్రో రైలు ప్రాజెక్టుల విషయంలో ఒక పెద్ద ముందడుగు పడింది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేందుకు నేడు ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన భాగస్వామ్యంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. మొత్తం రూ.21,616 కోట్లతో విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు చేపట్టబోతున్నారు. విశాఖ మెట్రోకు రూ.11,498 కోట్లు, విజయవాడ మెట్రోకు రూ.10,118 కోట్ల వ్యయంతో టెండర్లు ఆహ్వానించనున్నారు.
ఈ ప్రాజెక్టుల తొలి దశలో 40 శాతం పనులకు టెండర్లు పిలుస్తున్నారు. మెట్రో రైలు ద్వారా ఈ రెండు నగరాల్లో రవాణా సమస్యలు తగ్గిపోవడం మాత్రమే కాదు, నగరాల అభివృద్ధికి కూడా దోహదం చేయనుంది.
ప్రాజెక్టులు పూర్తయితే ప్రజలకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. అలాగే నగరాల అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది.
ఇప్పటికే మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి ప్రాథమిక సర్వే, అవసరమైన అధ్యయనాలు పూర్తయ్యాయి. త్వరలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.