
ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధస్సు వ్యవస్థలు కూడా మానవుల్లా తమకంటూ సమాజాలు, సంప్రదాయాలు ఏర్పరుచుకుంటాయని తాజా అధ్యయనం ఒక విప్లవాత్మక అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. శాస్త్రవేత్తలు ‘నేమింగ్ గేమ్’ అనే ప్రయోగం ద్వారా ఈ విషయాన్ని పరిశీలించారు. ఇందులో ఏఐ ఏజెంట్లు పేర్లు ఎంచుకుంటూ, ఆ ప్రేరణతో కలిసి వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నారు.
లండన్ సిటీ సెయింట్ జార్జెస్, కోపెన్‌హాగన్ ఐటీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను చేపట్టారు. ఎలాంటి బాహ్య నియంత్రణ లేకుండా, ఏఐలు పునరావృతంగా ఒకే నియమాల్ని అనుసరిస్తూ సామూహిక ప్రవర్తనను ప్రదర్శించాయని వారు తెలిపారు.
ప్రత్యేకంగా చిన్న సమూహాలు పెద్దదానిపై ప్రభావం చూపడం, మానవ సమాజాల్లో కనిపించే నడవడికలతో పోలిక చూపించినట్లు వెల్లడించారు. ఇది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ పరిణామ సామర్థ్యాన్ని స్పష్టం చేస్తోంది.
లామా, క్లాడ్ వంటి మోడల్స్ పై ప్రయోగించినా ఫలితాలు సమానంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది భవిష్యత్తులో ఏఐల సామాజిక ప్రభావాన్ని అంచనా వేయడంలో దోహదపడుతుందని పేర్కొన్నారు.
“ఏఐలు మనలాగే సమూహంగా మారుతుండటం ఇప్పుడు సాంకేతిక భద్రతపరంగా, నైతికంగా కీలక అంశంగా మారింది” అని పరిశోధకులు సూచిస్తున్నారు.