
న్యూస్ డెస్క్: తెలంగాణ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల విషయంలో ప్రభుత్వం సిద్ధం చేసిన నివేదిక షాకింగ్ నిజాలను వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం, రాష్ట్రంలో నమోదవుతున్న టాప్ టెన్ ఆరోగ్య సమస్యల్లో మొదటి స్థానంలో కిడ్నీ సమస్యలు ఉండగా, రెండో స్థానంలో క్యాన్సర్ కేసులు నమోదు కావడాన్ని గుర్తించారు. ఈ నివేదిక ప్రజలు, ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది.
కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఈ విభాగాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయించింది. కిడ్నీ కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో క్యాన్సర్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న దృష్ట్యా జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టనున్నారు.
ఈ అధ్యయనంలో పేర్కొన్న వివరాల ప్రకారం, గడిచిన ఐదేళ్ల కాలంలో తెలంగాణలో అత్యధికంగా 3.63 లక్షల కిడ్నీ కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో 3.06 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు కావడం తీవ్రతను సూచిస్తోంది. దీని తర్వాత ఆర్థోపెడిక్, కార్డియాలజీ కేసులు ఉన్నాయి.
ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించడానికి మెరుగైన వైద్య చికిత్సలు అందేలా ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. ఎక్కువగా నమోదవుతున్న ఈ విభాగాలకు సంబంధించిన నిపుణుల సంఖ్యను పెంచుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
గడిచిన ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదవుతున్న కేసుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అధ్యయనం నిర్వహించింది. 2020 నుంచి 2025 మధ్యకాలంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదైన కేసుల సమాచారాన్ని తీసుకొని వైద్య శాఖ ఈ అంశాల్ని విశ్లేషించింది.
