
న్యూస్ డెస్క్: భారత రూపాయి మరోసారి చారిత్రాత్మక కనిష్ఠానికి చేరింది. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి 88.14 వద్ద మొదలై, వెంటనే 88.16 స్థాయికి పడిపోయింది. దీంతో రూపాయి డాలర్‌తో పోలిస్తే జీవితకాల కనిష్ఠానికి చేరినట్టైంది.
ఇప్పటికే గత కొన్ని రోజులుగా రూపాయి ఒత్తిడిని ఎదుర్కొంటూ వస్తోంది. విదేశీ పెట్టుబడులు భారీగా వెనక్కి వెళ్లిపోవడం, అమెరికా అధిక టారిఫ్‌లు విధించడం వంటి అంశాలు ఈ పతనానికి కారణమయ్యాయి. గత మూడు ట్రేడింగ్ సెషన్లలోనే 2.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు దేశం నుంచి బయటకు వెళ్లాయి.
ఫారెక్స్ నిపుణులు రూపాయి పతనానికి ప్రధాన కారణం అమెరికా విధానాలే అని చెబుతున్నారు. ఎగుమతుల పోటీతత్వం దెబ్బతినడం, విదేశీ పెట్టుబడిదారులు వెనక్కి తగ్గడం వలన కరెన్సీపై ఒత్తిడి పెరిగిందని వారు విశ్లేషిస్తున్నారు.
ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. భారత్ టారిఫ్‌లను తగ్గించడానికి ముందుకు వచ్చినా, ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఆయన పేర్కొన్నారు. భారత్ రష్యాతోనే ఎక్కువ వ్యాపారం చేస్తోందని కూడా వ్యాఖ్యానించారు.
రూపాయి పడిపోతున్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 207 పాయింట్లు పెరిగి 80,571 వద్ద, నిఫ్టీ 60 పాయింట్లు లాభపడి 24,685 వద్ద కొనసాగుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం రూపాయికి 88.50 వద్ద నిరోధం, 87.50 వద్ద మద్దతు లభించే అవకాశం ఉంది.
