
న్యూస్ డెస్క్: ప్రపంచంలోని అత్యంత సంక్లిష్టమైన సాఫ్ట్‌వేర్ “బగ్స్” (Bugs) ను పరిష్కరించే టెక్ దిగ్గజం గూగుల్, ఇప్పుడు నిజమైన “బగ్స్” (Bugs) దెబ్బకు వణికిపోయింది. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ చెల్సియా క్యాంపస్‌లో నల్లుల బెడద తీవ్రం కావడంతో, ఆఫీసును తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అత్యాధునిక సాంకేతికతకు కేంద్రంగా ఉన్న ఈ ఆఫీసులో నల్లుల ఉనికిని గుర్తించింది ఏఐ (AI) కాదు, ఒక “స్నిఫర్ డాగ్” (sniffer dog). శునకం హెచ్చరికతో అప్రమత్తమైన యాజమాన్యం, వెంటనే ఉద్యోగులకు ఈ-మెయిల్ పంపింది.
కంపెనీ తక్షణమే ఉద్యోగులందరినీ “వర్క్ ఫ్రమ్ హోమ్”కు పంపేసింది. సోమవారం వరకు ఆఫీసు కార్యకలాపాలు నిలిపివేసి, మొత్తం ప్రాంగణంలో భారీ ఎత్తున శానిటైజేషన్, శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభించింది.
గూగుల్ కార్యాలయానికి ఇది కొత్త సమస్య కాదు. 2010లో కూడా ఇదే తరహా నల్లుల బెడద తలెత్తింది. ఆఫీసులోని ఫ్యాన్సీ అలంకరణ వస్తువులు, పెద్ద బొమ్మలే ఈ నల్లులకు ఆవాసాలుగా మారుతున్నాయని యాజమాన్యం భావిస్తోంది.
ఈ వార్తపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. “సాఫ్ట్‌వేర్ బగ్స్‌ను ఫిక్స్ చేసే గూగుల్, సొంత ఆఫీస్ బగ్స్‌ను ఫిక్స్ చేసుకోలేకపోయింది” అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
ఈ ఘటనతో గూగుల్ ఉద్యోగులు ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు, అదే “బెడ్‌బగ్స్ వెర్షన్ 2.0!”. ఎంత టెక్నాలజీ పెరిగినా, కొన్ని ప్రాథమిక సమస్యలు తప్పవని ఈ ఘటన నిరూపించింది.
