
న్యూస్ డెస్క్: అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయ టెక్ నిపుణుల కుటుంబాలకు పెద్ద ఊరట లభించింది. హెచ్-4 వీసాదారుల ఉద్యోగ హక్కును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి యూఎస్ సుప్రీంకోర్టు నిరాకరించింది.
దీంతో దాదాపు దశాబ్ద కాలంగా కొనసాగుతున్న న్యాయపోరాటానికి తెరపడినట్లయింది. ఈ నిర్ణయం వేలాది భారతీయ కుటుంబాల్లో నెలకొన్న అనిశ్చితిని తొలగించి, వారికి గొప్ప స్థైర్యాన్ని ఇచ్చింది.
హెచ్-4 ఈఏడీ (ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ‘సేవ్ జాబ్స్ యూఎస్ఏ’ అనే సంస్థ చాలా కాలంగా న్యాయపోరాటం చేస్తోంది. ఈ పిటిషన్పై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు ఆసక్తి చూపలేదు. ఫలితంగా కింది కోర్టు ఇచ్చిన తీర్పు అమల్లో ఉంటుంది. అంటే హెచ్-4 వీసాదారుల ఉద్యోగ హక్కు ఇకపై కూడా కొనసాగుతుంది.
ఈ విధానం వల్ల అమెరికన్ల ఉద్యోగావకాశాలు దెబ్బతింటున్నాయని ఆ సంస్థ వాదిస్తోంది. ఈఏడీ విధానం వల్ల ఉన్నత విద్యావంతులు, నైపుణ్యం కలిగిన భారతీయ మహిళలు తమ కెరీర్లను అమెరికాలో కొనసాగించగలుగుతున్నారు. అనేక మంది పెద్ద కంపెనీలలో స్థిరపడగా, మరికొందరు సొంతంగా వ్యాపారాలు కూడా ప్రారంభించారు.
2015లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుని, ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఇది ఒక వరంలా మారింది. ఈ సదుపాయం లేకపోతే గ్రీన్ కార్డ్ వచ్చేంత వరకు వారు ఖాళీగా ఉండాల్సి వచ్చేది.
గతంలో డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఈ విధానాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలో చాలా కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. ఇప్పుడు చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయినప్పటికీ, భవిష్యత్తులో రాజకీయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం లేకపోలేదని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు.
