
న్యూస్ డెస్క్: తెలంగాణ బీజేపీ నేతల అంతర్గత కుమ్ములాటలు పార్టీకి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ 2028 లక్ష్యంగా పనిచేయాలని ఎంపీలకు క్లాసులు పీకుతుంటే, తెలంగాణ నేతలు మాత్రం తమకు నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటుశాతం పెరిగినా, స్థానిక నేతలు చిన్నపిల్లల్లా కుమ్ములాడుకుంటుండటం పార్టీకి తలనొప్పిగా మారింది.
తెలంగాణ బీజేపీలో అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోంది. నేతలు వాదులాడుకోవడం కుమ్ములాడుకోవడం దాటి, సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు బురద చల్లుకుంటున్నారు. ఈ వ్యవహారం మింగుడు పడక పార్టీ కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. అడ్డూ అదుపు లేకుండా పోతున్న ఈ సోషల్ మీడియా పోస్టుల వెనక సీనియర్ల హస్తం ఉందన్న అనుమానాలు వినవస్తున్నాయి. దీంతో అగ్రనాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
పార్టీ పరువు తీసేవారు ఎంతటి నాయకులైనా వదిలే ప్రసక్తే లేదన్నట్లుగా అధినాయకత్వం వ్యవహరిస్తోంది. వెంటపడి మరీ పోస్టుల్ని డిలిట్ చేయిస్తోంది. ఒకరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే పోస్టులు అవసరమా అని ప్రశ్నిస్తోంది. పోస్టులు పెట్టిన వారిని ఢిల్లీకి పిలిపించుకుని మందలిస్తోంది. సొంత టీములు ఏర్పాటు చేసుకుని తమకు నచ్చని నేతలపై కామెంట్లు పెడుతున్నారని నాయకత్వం దృష్టికి వచ్చింది. విద్వేష పోస్టుల వెనక పార్టీ పెద్ద తలకాయలే ఉంటుండటంతో అధినాయత్వానికి తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకుంటూ పార్టీలో ఉన్నవారిపైనే అన్యాయంగా పోస్టులు పెట్టేవారిపైన కచ్చితంగా కఠిన చర్యలుంటాయని అధిష్టానం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావుతోపాటు మరికొందరు నేతలపై దుష్ప్రచారంతో పోస్టులు పెట్టడం పార్టీకి ఏమాత్రం శ్రేయస్కరం కాదని అధిష్టానం అంటోంది. కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని వారు మౌనంగా ఉండిపోయే ప్రమాదం ఉన్నందున అధిష్టానం రంగంలో దిగక తప్పలేదు.
