
న్యూస్ డెస్క్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి నేతృత్వంలోని ఓబులాపురం మైనింగ్ అక్రమాల కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై విచారణ తప్పదని తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో ఈ కేసులో శ్రీలక్ష్మికి ప్రమేయం లేదని చెప్పిన కోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇప్పుడు తీర్పు మారుస్తోంది.
ఈ కేసును విచారించేందుకు సీబీఐ, ఈడీలకు అనుమతి ఇచ్చినట్లు హైకోర్టు పేర్కొంది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నామని, శ్రీలక్ష్మి పాత్రను మళ్లీ నిగూఢంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.
సుప్రీంకోర్టు సూచన మేరకు, శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్ దాఖలు చేసినా, విచారణ తప్పదని తాజా తీర్పులో పేర్కొంది. ఆమెపై ఉన్న ఆరోపణలు పూర్తిగా పరిశీలించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది.
ఓబులాపురం మైనింగ్ కుంభకోణంలో శ్రీలక్ష్మి అన్ని అనుమతులు ఉద్దేశపూర్వకంగానే ఇచ్చారన్నది సీబీఐ వాదన. దీనిపై శ్రీలక్ష్మి మాత్రం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల ప్రకారమే అనుమతులు ఇచ్చానని అంటున్నారు.
కేసు పూర్తి స్థాయిలో విచారణకు రాగా, శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలపై నిజనిజాలు త్వరలో వెలుగులోకి రానున్నాయి. హైకోర్టు తాజా తీర్పుతో ఈ కేసు మళ్లీ కీలక దశకు చేరుకుంది.
