
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయుడు శుభాంశు శుక్లా అందరికీ సుపరిచితమే. తాజాగా ఆయన ఒక ఈవెంట్ లో పాల్గొని స్పేస్ ట్రావెల్ గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. సాధారణంగా అంతరిక్షానికి వెళ్లాలంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలని అందరికీ తెలుసు. కానీ, అక్కడికి వెళ్లే ముందు మన నోట్లోని జ్ఞాన దంతాలను (Wisdom Teeth) పీకించుకోవాలని ఆయన చెప్పిన విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అసలు విషయం ఏంటంటే, అంతరిక్ష నౌకలో అత్యవసర వైద్య చికిత్సలకు ఏర్పాట్లు ఉంటాయి కానీ, దంతాలకు సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం మాత్రం కష్టం. అందుకే ముందు జాగ్రత్త చర్యగా వ్యోమగాముల జ్ఞాన దంతాలను తొలగిస్తారట. తన ప్రయాణానికి ముందు తనకు ఉన్న రెండు జ్ఞాన దంతాలను తీసేయించుకున్నానని శుభాంశు తెలిపారు. స్పేస్ లో పంటి నొప్పి వస్తే చికిత్స చేయడం అసాధ్యం కాబట్టి ఈ రూల్ పెట్టారని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో శుభాంశుతో పాటు గగన్ యాన్ మిషన్ కు ఎంపికైన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్, అంగద్ ప్రతాప్ కూడా పాల్గొన్నారు. వారు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రశాంత్ నాయర్ తన మూడు దంతాలను తొలగించుకోగా, అంగద్ ప్రతాప్ ఏకంగా నాలుగు దంతాలను తీయించుకున్నారట. అంటే అంతరిక్ష యానానికి ఎంపికైన వారు కచ్చితంగా ఈ డెంటల్ ప్రొసీజర్ ను దాటాల్సిందేనన్నమాట.
భవిష్యత్తులో ఎవరైనా వ్యోమగామి కావాలని కలలు కంటుంటే, వారు కేవలం ఫిజికల్ ట్రైనింగ్ మాత్రమే కాదు, ఇలాంటి చిన్న చిన్న త్యాగాలకు కూడా సిద్ధంగా ఉండాలని శుభాంశు సూచించారు. బయట ప్రపంచానికి ఎంతో గ్లామరస్ గా కనిపించే వ్యోమగాముల జీవితం వెనుక, ఇలాంటి కఠినమైన నిబంధనలు కూడా ఉంటాయని ఈ ఘటనతో అర్థమవుతోంది.
