
న్యూస్ డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కోర్టు ధిక్కరణ కేసులో బుధవారం తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో జరిగిన రాజకీయ కలకలం తర్వాత ఆమెపై మొదటిసారిగా శిక్ష విధించబడింది.
ఢాకాలోని అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్-1 ఈ తీర్పును వెల్లడించింది. జస్టిస్ ఎండీ గోలాం మొర్తజా నేతృత్వంలోని ధర్మాసనం ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
ఈ కేసులో గైబంధా ప్రాంతానికి చెందిన షకీల్ ఆకంద్ బుల్బుల్‌కి రెండు నెలల శిక్ష కూడా విధించారు. ఇది బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు.
హసీనా పై గత ఏడాది జరిగిన నిరసనల సమయంలో అమానవీయ చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోంది.
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, 2024 జూలై-ఆగస్టు మధ్య హింసాత్మక ఘటనల్లో 1,400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా వేయబడింది.
హసీనా తనపై ఉన్న ఆరోపణలను ఖండిస్తూ, న్యాయపోరాటం చేస్తామని ఆమె తరఫు న్యాయవాది ప్రకటించారు. ప్రస్తుతం ఆమె భారతదేశంలో ఉన్నట్టు సమాచారం.