
న్యూస్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగిస్తున్న చాట్ జీపీటీపై ఆ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్ మన్ తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. యూజర్లు చాట్ జీపీటీతో పంచుకునే సమాచారం పూర్తిగా రహస్యంగా ఉండదని ఆయన స్పష్టం చేశారు.
అవసరమైతే, ముఖ్యంగా న్యాయపరంగా కోర్టు ఉత్తర్వులు వచ్చినపుడు, వినియోగదారుల సమాచారాన్ని బయటకు వెల్లడిస్తామని తెలిపారు.
అదేవిధంగా, యూజర్లు డిలీట్ చేసిన సందేశాలు, చిత్రాలను 30 రోజులు వరకు మాత్రమే నిల్వ ఉంచుతామని, ఆ తర్వాత శాశ్వతంగా తొలగిస్తామని చెప్పారు. అయితే న్యాయపరమైన సమస్యలు తలెత్తినప్పుడు మాత్రం వాటిని నిల్వ ఉంచే అవకాశం ఉందని తెలిపారు.
గతంలో కూడా చాట్ జీపీటీ పూర్తిగా నమ్మదగిన టెక్నాలజీ కాదని ఆల్ట్ మన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వినియోగదారుల్లో గంభీర చర్చకు దారి తీశాయి. డేటా ప్రైవసీపై ఇప్పుడు మరిన్ని సందేహాలు మొదలయ్యాయి.
వినియోగదారులు తమ వ్యక్తిగత విషయాలను చాట్ జీపీటీతో పంచుకునేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. డేటా ప్రైవసీపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.
