
ఆంధ్రప్రదేశ్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం పూర్తిగా ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లేనని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోగా, తమపై కక్ష సాధింపు చర్యలతో వేధిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
అనకాపల్లిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన రోజా, వైసీపీ అధినేత జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల ద్వారా జగన్ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని, కూటమి ప్రభుత్వం ఆ స్థాయిలో విశ్వాసం పొందలేకపోతోందని ఆమె విమర్శించారు.
“ఈ ఎన్నికల్లో మాకు న్యాయం జరగలేదు. ఈవీఎంల్లో జరిగిన ట్యాంపరింగ్ వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా తీర్పు ఇస్తారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది” అని రోజా ధీమాగా చెప్పారు.
తమపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ఆరోపించిన రోజా, “ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మాపై దాడులు చేసే వాళ్లు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు” అని హెచ్చరించారు.
ఆమె మరింతగా మాట్లాడుతూ, “జగన్ 2.0 అంటే ఏంటో కూటమి నేతలు త్వరలో తెలుసుకుంటారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే, ప్రజల కోసం మరింత శక్తివంతమైన సంక్షేమం అమలు చేస్తాం” అని ప్రకటించారు.
