
న్యూస్ డెస్క్: పార్లమెంట్ లో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లోక్ సభ వేదికగా విపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో ఈవీఎంల పనితీరును తప్పుబట్టాయి. వెంటనే ఎలక్ట్రానిక్ యంత్రాలను పక్కనపెట్టి, మళ్లీ పాత పద్ధతిలో పేపర్ బ్యాలెట్ ను తీసుకురావాలని డిమాండ్ చేశాయి.
ఈ చర్చలో రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలోని అవకతవకలపై సీరియస్ అయ్యారు. నకిలీ ఓట్లు, ఫోటోలతో జాబితాలు తయారు చేస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ కు నెల ముందే పార్టీలకు లిస్టులు ఇవ్వాలని, అలాగే సీసీటీవీ ఫుటేజ్ ల విషయంలో పారదర్శకత ఉండాలని ఈసీని కోరారు.
కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి మాట్లాడుతూ ఈవీఎంలు వాడితే కచ్చితంగా వీవీప్యాట్ లను లెక్కించాల్సిందేనని పట్టుబట్టారు. అమెరికా, జర్మనీ లాంటి టెక్నాలజీ ఉన్న దేశాలే బ్యాలెట్ పేపర్ వాడుతున్నప్పుడు, మనకెందుకని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు.
అయితే విపక్షాల విమర్శలను ప్రభుత్వం గట్టిగానే తిప్పికొట్టింది. గెలిచినప్పుడు ఈవీఎంలు బాగానే ఉంటాయి కానీ, ఓడిపోతేనే ఇలాంటి రాగాలు తీస్తారని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ ఎద్దేవా చేశారు. ప్రపంచం మొత్తం భారత ఎన్నికల వ్యవస్థను మెచ్చుకుంటోందని గుర్తుచేశారు.
