
అక్రమ సంబంధాలు పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తున్నాయి. క్షణిక సుఖం కోసం కట్టుకున్న వారిని కడతేర్చడానికి కూడా వెనుకాడటం లేదు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడం నాగర్‌కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. అచ్చంపేటలో జరిగిన లక్ష్మణ్ నాయక్ హత్య కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గత నెల 25న అచ్చంపేటలోని మారుతీనగర్ లో లక్ష్మణ్ నాయక్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే తన తమ్ముడి మరణంపై అనుమానం ఉందని మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా, ఈ హత్య చేసింది మరెవరో కాదు.. సాక్షాత్తూ మృతుడి భార్య పద్మ అని తేలింది.
అసలు విషయానికి వస్తే.. పద్మ ఉప్పునుంతల మండలంలో ప్రభుత్వ టీచర్ గా పని చేస్తోంది. ఆమెకు అదే మండలంలో పని చేసే మరో టీచర్ గోపీతో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. గత ఏడాది కాలంగా వీరి వ్యవహారం నడుస్తోంది. అయితే వీరిద్దరి సంబంధానికి భర్త లక్ష్మణ్ నాయక్ అడ్డుగా ఉన్నాడని భావించి, అతన్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేశారు.
పథకం ప్రకారం నవంబర్ 24 రాత్రి నిద్రపోతున్న లక్ష్మణ్ నాయక్ ముక్కు, నోరు మూసేసి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు పద్మ స్కూల్ కు వెళ్లి, తన భర్త ఫోన్ తీయడం లేదంటూ నాటకమాడింది. ఇంటికి వచ్చి భర్త చనిపోయాడని ఏడుస్తూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసుల విచారణలో ఆమె చేసిన తప్పు ఒప్పుకోక తప్పలేదు. పవిత్రమైన వృత్తిలో ఉండి ఇలాంటి ఘాతుకానికి పాల్పడటం అందరినీ షాక్ కు గురిచేసింది.
