
న్యూస్ డెస్క్: రాష్ట్ర ఐటీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని నిర్ణయించింది. మంత్రి నారా లోకేశ్ అధికారులతో సమీక్షలో నాలుగు సంవత్సరాల్లో 10 లక్షల ఉద్యోగాలు కల్పించాలని స్పష్టం చేశారు.
ఉండవల్లిలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ. లక్ష కోట్ల పెట్టుబడులకు 95 సంస్థలు ముందుకొచ్చినట్టు లోకేశ్ వివరించారు.
టీసీఎస్, కాగ్నిజెంట్‌లకు విశాఖలో భూములు కేటాయించారని అధికారులు తెలియజేయగా, వీటి పనులు వేగవంతం చేయాలని ఆయన సూచించారు. అవసరమైన అనుమతులు, సౌకర్యాలను అందించాలన్నారు.
బెంగళూరులో జరిగిన సమావేశాల్లో ఏఎన్‌ఎస్‌ఆర్, సత్వ సంస్థలతో జీసీసీల ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయని లోకేశ్ వెల్లడించారు. వీటి ద్వారా 35,000 ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.
ఎంఓయూలు చేసిన సంస్థలతో నిరంతరంగా చర్చలు జరుపుతూ యూనిట్లు స్థాపించేలా చూడాలని అధికారులకు చెప్పారు. చిన్న సంస్థల కోసం అన్ని జిల్లాల్లో కో-వర్కింగ్ స్పేస్‌లు ఏర్పాటుకు సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశముంది.