
న్యూస్ డెస్క్: భారత చట్టాలను ఉల్లంఘించి విదేశాలకు పరారైన వ్యాపారవేత్తలు లలిత్ మోదీ, విజయ్ మాల్యా లండన్లో మరోసారి కలసి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల లండన్లో జరిగిన ఓ లగ్జరీ పార్టీలో ఇద్దరూ కలిసి పాటలు పాడుతూ ఎంజాయ్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఈ పార్టీలో లలిత్ మోదీ, మాల్యా కలిసి ఫ్రాంక్ సినాత్రా పాడిన ‘ఐ డిడ్ ఇట్ మై వే’ అనే పాటను ఆలపించగా, వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ కూడా పార్టీలో పాల్గొన్నారు. గేల్ లలిత్, మాల్యాతో దిగిన ఫోటోను షేర్ చేయడం ఈ కార్యక్రమంపై మరింత దృష్టిని కేంద్రీకరించింది.
వీడియోను లలిత్ మోదీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ, “ఇది వివాదాస్పదమే కానీ నేను నా స్టైల్లోనే చేస్తున్నాను” అనే క్యాప్షన్ పెట్టారు. ఇది వారి ధిక్కార ధోరణిని చూపిస్తోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
లలిత్ మోదీపై మనీలాండరింగ్ ఆరోపణలు, మాల్యాపై రూ.9,000 కోట్ల బ్యాంక్ రుణ ఎగవేత కేసులు ఉన్నాయి. వారిద్దరినీ భారత్కు రప్పించేందుకు చట్టపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, వారు ఇలా లండన్లో ఆడిపాడుతూ కనిపించడం దుమారానికి దారితీస్తోంది.
భారత బ్యాంకులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ ఇద్దరూ ఈజీగా జీవితం గడపడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని నినాదాలు బలపడుతున్నాయి.