
హైదరాబాద్: పాతబస్తీలో పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ప్రముఖ రౌడీషీటర్, పహిల్వాన్ జఫర్, అతని కొడుకులు సయిద్, సులేమాన్ ఇళ్లలో డీసీపీ కిరణ్ ఖరే నేతృత్వంలో పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులకు దిమ్మతిరిగే దృశ్యాలు కనిపించాయి. భారీ ఎత్తున కత్తులు, ఇతర మారణాయుధాలతో పాటు పలు కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అసలు ఎవరీ జఫర్ పహిల్వాన్ అని ఆరా తీస్తే షాకింగ్ విషయాలు తెలిశాయి. ఇతను గతంలో కుస్తీ పోటీల్లో విజేతగా నిలిచిన పహిల్వాన్ మాత్రమే కాదు, రెండుసార్లు కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి డిస్మిస్ అయిన మాజీ పోలీస్ కూడా. అంతేకాదు, గతంలో కార్పొరేటర్ గా కూడా పనిచేశాడు. ఇతనిపై ఏకంగా 40కి పైగా కేసులు ఉన్నాయంటే ఇతని నేర చరిత్ర ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు.
జఫర్ ప్రధాన దందా సెటిల్మెంట్లు, వసూళ్లు. పాతబస్తీలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే జఫర్ కు లక్ష నుంచి రెండు లక్షల వరకు ‘మామూళ్లు’ ముట్టజెప్పాల్సిందే. లేదంటే మారణాయుధాలతో బెదిరింపులకు దిగుతాడు. గతంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కాల్పులు జరిపిన ఘటనలో జైలుకు కూడా వెళ్ళాడు. ఇప్పుడు అతని కొడుకులు కూడా తండ్రి బాటలోనే నడుస్తూ పోలీసుల రికార్డుల్లోకెక్కారు. ఈ సోదాలతో పాతబస్తీ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
