
న్యూస్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా ప్రసంగంలో ఆయన ‘టారిఫ్’ (సుంకం) అనే పదాన్ని ప్రపంచంలోనే అత్యంత అందమైన పదంగా అభివర్ణించారు. తన టారిఫ్ విధానాల వల్లే అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని, గత పది నెలల్లోనే దేశంలోకి సుమారు 18 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విదేశీ కంపెనీలు అమెరికాకు వచ్చి ఫ్యాక్టరీలు పెట్టేలా ఈ సుంకాలు ఒత్తిడి తెస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ వ్యవహారాల పైనా ట్రంప్ ఘాటుగా స్పందించారు. తాను పగ్గాలు చేపట్టిన కేవలం పది నెలల్లోనే ఎనిమిది యుద్ధాలను ఆపగలిగానని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడంలో, గాజా యుద్ధాన్ని అదుపు చేయడంలో తన పాత్ర ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా పట్ల ఇతర దేశాలకు ఉన్న భయాన్ని తన విజయంగా ఆయన అభివర్ణించారు. ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో ప్రపంచ వేదికపై అగ్రరాజ్య ఆధిపత్యాన్ని చాటుతానని మరోసారి స్పష్టం చేశారు.
ఇక క్రిస్మస్ వేళ అమెరికా సైనికుల కోసం ట్రంప్ ఒక భారీ ప్రకటన చేశారు. సుమారు 14.5 లక్షల మంది సైనిక సిబ్బందికి ఒక్కొక్కరికి 1776 డాలర్ల (రూ. 1.5 లక్షల పైచిలుకు) నగదు బహుమతిని ప్రకటించారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ ఏడాది (1776) కి గుర్తుగా దీనిని ‘వారియర్ డివిడెండ్’ అని పిలుస్తున్నారు. టారిఫ్ ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఈ బోనస్ ఇస్తున్నామని, దేశం కోసం పోరాడే సైనికులకు ఇది కనీస గౌరవమని ఆయన తెలిపారు.
మొత్తంగా చూస్తే, ట్రంప్ దూకుడు ఆర్థికంగాను, రాజకీయంగాను కొత్త చర్చకు దారితీసింది. టారిఫ్ లను కేవలం పన్నులుగా కాకుండా ఒక శక్తివంతమైన ఆయుధంగా ఆయన వాడుకుంటున్నారు. అక్రమ వలసలు, సరిహద్దు భద్రత విషయంలో కూడా కఠినంగా ఉంటామని హెచ్చరించారు. తన నిర్ణయాలు ప్రపంచ దేశాలకు ఇబ్బంది కలిగించినా, అమెరికా ప్రజల ప్రయోజనాలే తనకు ముఖ్యమని ట్రంప్ మాటల్లో స్పష్టమైంది.
