
అమెరికా: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ పాలిటిక్స్ పక్కనపెట్టి, క్రిస్మస్ వేళ పిల్లలతో సరదాగా గడిపారు. ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో భార్య మెలానియాతో కలిసి ఆయన ‘శాంటా ట్రాకర్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలతో ఫోన్లో మాట్లాడుతూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు కూడా ట్రంప్ తన మార్కు రాజకీయాన్ని వదలలేదు. “మన దేశంలోకి కేవలం ‘మంచి శాంటా’లను మాత్రమే అనుమతిస్తాం.. ‘బ్యాడ్ శాంటా’లు చొరబడకుండా చూసుకుంటాం” అంటూ తన ఇమ్మిగ్రేషన్ పాలసీని పరోక్షంగా గుర్తుచేశారు. సరిహద్దు భద్రతను క్రిస్మస్ పండుగతో లింక్ చేస్తూ ఆయన చేసిన ఈ కామెడీ కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి.
4 నుంచి 10 ఏళ్ల వయసున్న పిల్లలతో ట్రంప్ చాలా ఉల్లాసంగా ముచ్చటించారు. “ఈసారి క్రిస్మస్ కు ఏం గిఫ్ట్స్ కోరుకుంటున్నారు?” అని ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. మధ్యలో మెలానియా వేరే కాల్ మాట్లాడుతుంటే, ఆమె తన మాట వినడం లేదంటూ ట్రంప్ వేసిన సెటైర్లు అక్కడున్న వారిని నవ్వించాయి. శాంటా ఎక్కడున్నాడో ట్రాక్ చేస్తూ పిల్లల్లో ఉత్సాహాన్ని నింపారు.
అయితే, ఈ సరదా ఎంతో సేపు సాగలేదు. కార్యక్రమం ముగిసిన కాసేపటికే ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో తన అసలు స్వరూపాన్ని చూపించారు. “దేశాన్ని నాశనం చేస్తున్న రాడికల్ లెఫ్ట్ వర్గాలతో సహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు” అంటూ ఒక ఘాటు పోస్ట్ పెట్టారు. పండుగ రోజు కూడా ప్రత్యర్థులపై విమర్శలు ఆపకపోవడం ట్రంప్ శైలికి అద్దం పడుతోంది.
