
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. జనం ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న వేళ ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాణాలను కాపాడుకోవడానికి అత్యవసరమైన ఎయిర్ ప్యూరిఫైయర్ల మీద ఏకంగా 18 శాతం జీఎస్టీ విధించడం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ప్రజలకు ఉపశమనం కలిగించాల్సింది పోయి, అధిక పన్నులతో భారం మోపడంపై అసహనం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్ల మీద ఇంత భారీ పన్నులు వేయడం సబబు కాదని కోర్టు అభిప్రాయపడింది. వెంటనే జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై పన్నును తగ్గించడం లేదా పూర్తిగా రద్దు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఎయిర్ ప్యూరిఫైయర్ ను కేవలం ఒక లగ్జరీ వస్తువుగా కాకుండా, ప్రాణాలను కాపాడే అత్యవసర వైద్య పరికరంగా గుర్తించి 5 శాతం స్లాబ్ లోకి తేవాలన్న పిటిషన్ పై కోర్టు సానుకూలంగా స్పందించింది.
ఈ పిటిషన్ విచారణ సమయంలో స్పందించడానికి సమయం కావాలని కేంద్రం తరఫు న్యాయవాదులు కోరగా కోర్టు మండిపడింది. కాలుష్యం వల్ల వేల సంఖ్యలో ప్రజలు చనిపోయేదాకా వేచి చూస్తారా అని నిలదీసింది. ఒక మనిషి రోజుకు 21 వేల సార్లు శ్వాస తీసుకుంటారని, కలుషిత గాలి వల్ల ఎంత నష్టం జరుగుతుందో అంచనా వేయాలని సూచించింది. కనీసం ఇలాంటి పరికరాలను అయినా సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది.
వాయు కాలుష్యం ఒక హెల్త్ ఎమర్జెన్సీగా మారినప్పుడు జాతీయ భద్రతా చట్టం కింద పన్ను మినహాయింపు ఎందుకు ఇవ్వకూడదని కోర్టు ప్రశ్నించింది. ప్రజల ప్రాణాల కంటే ప్రభుత్వానికి పన్ను వసూళ్లే ముఖ్యమా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ అంశంపై వెంటనే స్పందన తెలియజేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 26కు వాయిదా వేసింది.
